Tuesday, April 6, 2010

సమాధులు బతికుండగానే కట్టుకున్నారు

బ్రతికి ఉండగనే చేయించుకుంటిరి మీకోరకు సమాదులు
బ్రతికి ఉండగ తలిదండ్రుల సేవ జేసిన చరితార్డులు మీరు

పుట్టిననాడు మీకు జన్మమిచ్చినవారు సంతసించిరి 
పిదప యుక్త కాలమందు వివాహమహోత్సవంబు జరిపిరి 

జన్మించిన మీవారిని జూసి ఉప్పొంగితిరి జన్మమిచ్చినమిమ్ము మరతురని తెలియక
జన్మించిన వారందరూ అట్టివారనబోకు కొందరైనను గలరేమో మీవంటి వారు

మీతరమునకు మీరు మార్గమెదికితిరి ఆశలడియసలతో చూడగా నేటితరము
ఈనాటితరం గ్రహించాలి అంతరం! తుడిచివేయాలి!! కన్నవారి కన్నీటి వ్యధలు!!!  

ఈరోజు (ఏప్రిల్ 6, 2010) ఆంధ్ర జ్యోతి దినపత్రికలోని వార్త (వెలుగులోకి తెచ్చినందుకు  ప్రత్యేక కృతజ్ఞతలతో)  యధాతదంగా....  
ఇవి మా సమాధులే బతికుండగానే కట్టుకున్నాం వారసులు పట్టించుకోరన్న భయంతోనే!
మెదక్ జిల్లాలో వింత అలవాటు

మునిపల్లి, ఏప్రిల్ 5 (ఆన్‌లైన్): స్వార్థం రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో చనిపోయాక తమవాళ్లు తమకు సమాధులైనా కట్టిస్తారో లేదోనన్న అనుమానం, భయం వారిని వెన్నాడాయి. అందుకే.. బతికుండగానే తమకు కావల్సిన రీతిలో సమాధులు కట్టించుకుంటున్నారు. సమాధులూ ఆలయాలేనని వారి నమ్మి క. ఒకరు, ఇద్దరు కాదు.. మెదక్‌జిల్లా మునిపల్లి మండలంలో ఐదుగురు ఇలా బతికుండగానే సమాధులు కట్టించుకున్నారు. వీరిలో ముగ్గురు తమ సతీమణులకూ వాటిలో భాగం పంచి ఇ చ్చారు.

మునిపల్లి మండలం పెద్ద చెల్మడ గ్రా మానికి చెందిన గోవిందపురం పాపయ్య (90) ఐదేళ్ల క్రితమే సమాధి కట్టించుకున్నారు. పెద్దలోడికి చెందిన కప్పాటి బసప్ప (85) మూడేళ్ల క్రితం.. అదే గ్రామానికి చెందిన దేవగోని బసప్ప ఇటీవల సమాధులు నిర్మించుకున్నారు. సంగని బసప్ప నాలుగేళ్ల క్రితం కట్టించుకుంటే, మునిపల్లికి చెందిన ఆకుల చంద్రప్ప 30 ఏళ్ల క్రితమే తన సమాధి కట్టించుకున్నారు.

తండ్రి పాదరక్షలకూ పూజలు

ఐదేళ్ల క్రితం తన సమాధి కట్టించుకున్న గోవిందపురం పాపయ్య.. ప్రతిరోజూ అక్కడ పూజలు చేస్తారు. ఈయన తండ్రి సంగప్ప గతం లో కాశీ వెళ్తూ మార్గమధ్యంలో మహారాష్ట్రలో మరణించారు. ఆయన చివరిచూపు సైతం దక్కలేదని పాపయ్య బాధపడుతుంటారు. తన పరిస్థితి ఎలా ఉంటుందోనని.. ముందుగానే సమా ధి కట్టించుకుని, అక్కడ తన తండ్రి చివరి జ్ఞాపకంగా మిగిలిన ఆయన పాదరక్షలనూ పెట్టి పూజిస్తున్నారు. తాను మరణించిన తర్వాత తన తో పాటు తండ్రి పాదరక్షలు కూడా పెట్టి సమాధి చేయాలని కుటుంబసభ్యులకు చెప్పారు.

శివనామ స్మరణం

కప్పాటి బసప్ప మహా శివభక్తుడు. ఎప్పుడూ శివనామస్మరణమే చేస్తుంటారు. ఈయన మూడేళ్ల క్రితం రూ.55 వేలతో సమాధి కట్టించుకున్నారు. అందులో తన జీవిత సహచరికీ చోటిచ్చారు. శ్రీశైలంలో హోమం చేసి, అక్కడి నుంచి లింగం, బసవేశ్వర ప్రతిమలను తెచ్చి సమాధిపై ప్రతిష్ఠించారు. ముక్తి కోసం అనునిత్యం సమాధి లో ధ్యానంలో మునిగిపోతానని చెబుతున్నారు. ఇక దేవగోని బసప్ప ఇటీవలే తనకు నచ్చినట్లు రూ.50వేలతో సమాధిని నిర్మించుకున్నారు. ఈయన తండ్రి కూడా అంతే.
తమవారు కడతారో లేదో..
తమవారు సమాధిని నిర్మిస్తారో లేదో అనే అనుమానంతో ముందే తనకు నచ్చిన విధంగా నాలుగేళ్ల క్రితం సమాధిని నిర్మించుకున్నానని కమ్మంపల్లికి చెందిన సంగని బసప్ప అన్నారు. దానిపై తన చిత్రపటంతోపాటు శివలింగాన్ని ప్రతిష్ఠించి రోజూ పూజలు చేస్తున్నారు.

ఏం చేస్తారోనని..

కని పెంచినవారి ఆదరణ కోల్పోతున్న ఈ రోజులలో తా ను చనిపోయాక మృతదేహాన్ని మంచి ప్రదేశంలో పూడ్చిపెడతారో, లేదోనని ముందే సమాధిని నిర్మించుకున్నానని ము నిపల్లికి చెందిన ఆకుల చంద్రప్ప అన్నారు. ఈయన  30 ఏళ్ల క్రితమే తన కోసం సమాధి కట్టించుకున్నారు. అయిన వారు ఆదరించకున్నా గ్రామస్తులైనా ముందుకొచ్చి తాను నిర్మించుకున్న సమాధిలో పెడతారు కదా అని అంటాడు చంద్రప్ప.

No comments:

Post a Comment